వికారాబాద్ జిల్లాలో ప్రతి సీజన్‌లో 1200 ఎకరాల వరకు ఉల్లి పంట సాగవుతుంది. అయితే.. ధర లేక, నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు కరవై ఆ పంట సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఉల్లి ధర క్వింటాకు రూ.800 పలికింది. దీంతో పెట్టుబడులు కూడా రావని, భవిష్యత్తులో మంచి ధర లభిస్తే విక్రయించాలని రైతులు భావించారు. గిడ్డంగులు లేకపోవడంతో కొందరు రైతులు పొలాల వద్దే సంప్రదాయ పద్ధతిలో ఉల్లిని నిల్వ ఉంచుతున్నారు.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం వెల్చాల్‌కు చెందిన రైతు నర్సింహారెడ్డి ఉల్లి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో ధర దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఉల్లికి ధర లేకపోవడం వల్ల దిగుబడిని నిల్వ చేసుకుని సరైన సమయంలో అమ్మాలని నిశ్చయించుకున్నాడు. కానీ.. నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల ప్రత్యామ్నాయంగా... సంప్రదాయ పద్ధతిని ఎంచుకున్నాడు. తన పొలంలోనే కంది కర్రలతో ఓ దడి కట్టాడు. అందులో ఉల్లి దిగుపడిని నిల్వచేశాడు. పైన టార్పాలిన్లు కప్పాడు. ఇంత చేసినా... వర్షానికి నిల్వలు తడిసి.. చెడిపోతున్నాయని నర్సింహారెడ్డి వాపోతున్నాడు. నిల్వకు సరైన సదుపాయాలు లేక... వర్షాల వల్ల తీవ్ర నష్టాలపాలయ్యాయని కంటతడి పెడుతున్నాడు.