ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లకు సంబంధించి ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను తితిదే ధర్మకర్తల మండలి పూర్వపు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాలుగుసార్లు కలిశారు.
పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. స్వయంగా విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో యాత్రికులు స్వామి వారికి సమర్పించిన పాతనోట్లను ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన తితిదే బోర్డు సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎక్కువ రోజులు వీటిని పెట్టుకోలేమని కూడా ఆయన మీడియాకు వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రొబేషనరి ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు..