వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు(oil palm cultivation telangana 2021) చేస్తే మంచి లాభాలొస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. పంట సాగుకు రైతులకు ఇవ్వాల్సిన మొక్కలు మొదలుకుని బిందు సేద్యం, పంటరుణం దాకా అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ పంట సాగుకు రాయితీలు, ప్రోత్సాహకాల నిధులు కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతం కలిపి ఉద్యానశాఖకు విడుదల చేయాలి. కానీ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ పంట సాగుకు బిందు సేద్యాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనికోసం ఎకరా తోటకు రూ.24 వేలు ఖర్చవుతుందని, అందులో రూ.16 వేలు రాయితీగా ఇవ్వాలని ఉద్యానశాఖ(telangana horticulture department news) నిర్ణయించింది. ఈ రాయితీలో 60 శాతం కేంద్రం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. బిందుసేద్యం ఏర్పాటుచేసే పొలాలన్నీ జీపీఎస్, సర్వే నంబర్లతో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలి... అవే భూములకు గతంలో ఏదైనా పంటకు బిందుసేద్యం రాయితీ ఇచ్చి ఉంటే మళ్లీ ఇవ్వరాదని కేంద్రం షరతు పెట్టింది. దీంతో ఎక్కువ మంది రైతులకు బిందుసేద్యం రాయితీ వచ్చే అవకాశం లేదు. గతంలో వేసిన పంటలు తీసేసి కొత్తగా ఆయిల్‌పాం సాగుచేయాలని ప్రభుత్వమే చెబుతున్నందున కొత్తగా బిందుసేద్యం రాయితీ ఎందుకు ఇవ్వరని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నారు రాలేదు.. మొక్కలెలా..
వచ్చే ఏడాది తొలి దశలో 5 లక్షల ఎకరాలు, ఆ తరవాత మరో రెండేళ్లలో మిగిలిన 15 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. వీటికి మొత్తం రూ.1600 కోట్లు రాయితీగా నిధులివ్వాలి. ఈ ఏడాది రూ.60 కోట్లు విడుదల చేయాలి. ఇంతవరకూ ఏమీ ఇవ్వలేదు. వచ్చే జూన్ నాటికి 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలంటే 3.25 కోట్ల మొక్కలు కావాలి. కోస్టారికా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల నుంచి ఇవి రావాలి. ఇప్పటివరకు రాష్ట్రానికి 40 లక్షల మొక్కలే వచ్చాయి. విదేశాల నుంచి ప్రైవేటు పామాయిల్ మిల్లుల(Palm oil mills telangana)కంపెనీలు మొక్కలు తెప్పించి వాటి నర్సరీల్లో 12 నెలల పాటు జాగ్రత్తగా పెంచి రైతులకివ్వాలి. మరో 2.85 కోట్ల మొక్కలు ఎప్పుడు రావాలో... పెంచి రైతులకు జూన్ నాటికి ఎలా ఇవ్వాలో తెలియడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఒక మొక్కను విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ 12 నెలలు పెంచి రైతులకు ఇవ్వడానికి రూ.190 నుంచి రూ.200 ఖర్చవుతుంది. ఇందులో రూ.33 మాత్రమే రైతు చెల్లిస్తే మిగతా సొమ్ము రాయితీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. మొక్కల దిగుమతి సుంకం కేంద్రం 30 నుంచి 5 శాతానికి తగ్గించింది. అయినా మొక్కలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డిని వివరణ అడగ్గా బిందు సేద్యం రాయితీ ఇవ్వడానికి నిబంధనలు సడలించాలని, గతంలో ఇచ్చినవారికి మళ్లీ ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు.