RAIDS IN CINEMA THEATERS : ఏపీలోని పలుప్రాంతాల్లోని సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. అనంతపురంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సినిమా హాళ్లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తినుబండారాలు, టికెట్ విక్రయాలు చేపట్టాలని యజమానులకు సూచించారు. సక్రమంగా రికార్డులు నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించారు. టికెట్ల ధరలను బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త చిత్రాల విడుదల సమయంలో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
లైసెన్స్ లేని థియేటర్ల మూసివేత..
చిత్తూరు జిల్లా కుప్పంలో లైసెన్స్ లు లేని నాలుగు సినిమా హాళ్లను మూసివేశారు. మదనపల్లెలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోని థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 7థియేటర్లలోని సినిమాలు నిలిపివేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నాకే థియేటర్లు ప్రారంభించుకోవాలని సూచించారు.
స్వచ్ఛందంగా మూసివేత..
RAIDS IN CINEMA THEATERS : తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ పరిధిలోని హాళ్లలో ఇవాళ చిత్రాల ప్రదర్శన ఆపేశారు. సినిమా హాళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు తమకు ఏ మాత్రం గిట్టుబాటు కాదంటూ... యాజమాన్యాలు హాళ్లను స్వచ్ఛందంగా మూసివేశాయి.
జిల్లాలోని రాజోలు, ముమ్మడివరం, మండపేట, కాకినాడ గ్రామీణం, రాజమహేంద్రవరం గ్రామీణం, జగ్గంపేట, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లోని సుమారు 40 హాళ్లలో చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పంచాయతీలోని నాన్ ఏసీ హాళ్లలో 5, 10, 15 రూపాయలు, ఏసీ హాళ్లల్లో 10, 15, 20 రూపాయలు చొప్పున టికెట్లు అమ్మాలని జీవో 35లో ప్రభుత్వం పేర్కొంది. ఈ డబ్బులు కనీసం కరెంట్ బిల్లులు కూడా రావని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: