ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదించింది. ఒక నెల జీతాలు చెల్లించాలంటే రూ.239.68 కోట్లు అవసరమని.. కానీ ప్రస్తుతం తమ ఖాతాల్లో రూ.7,49,62,000 మాత్రమే ఉన్నాయని వివరించింది. సెప్టెంబరు నెల వేతనాలు చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ... తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లీ విచారణ చేపట్టారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.
44 శాతం ఫిట్మెంట్తో రూ.900 కోట్ల భారం
రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు 67 శాతం వేతనాలు పెంచడంతో.. మొత్తం ఆదాయంలో 58 శాతం జీతాలకే పోతోందని వివరించారు. 2015 జూన్లో వేతన సవరణ అమలు చేసేటప్పడు... 44 శాతం ఫిట్ మెట్ ఇవ్వడం వల్ల ఏటా రూ.900 కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయడం వల్ల గతేడాది జులై నుంచి 15 శాతం మధ్యంతర భృతి అమలు చేయడంతో... మరో రూ.200 కోట్ల ఆర్థిక భారం ఏర్పడిందన్నారు.
ఆర్టీసీ నష్టాలు రూ.5,269 కోట్లు
ప్రస్తుతం ఆర్టీసీ రూ.5,269 కోట్లు నష్టాల్లో ఉందని ఇంఛార్జీ ఎండీ వెల్లడించారు. ఏటా రూ.4,882 కోట్లు ఆదాయం వస్తుండగా... రూ.5,811 కోట్లు ఖర్చవుతున్నాయని వివరించారు. ఆగస్టు నాటికి రూ.4,709 కోట్లు అప్పుల్లో ఉందని పేర్కొంది. ఉద్యోగుల పీఎఫ్, ఈఎల్ బకాయిలే సుమారు రూ.1,660 కోట్లు ఉన్నాయని... రూ.3,049 కోట్ల రుణాలు ఉన్నాయని వివరించింది. ఉద్యోగాలకు ప్రతీ నెల జీతాలిచ్చేందుకు కూడా ప్రభుత్వ సాయంపై ఆధారపడాల్సి వస్తోందని వివరించింది.
దసరా సీజన్లోనే రూ.125 కోట్లు నష్టం
కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ వద్ద పెండింగ్లో ఉండగానే... కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. సమ్మె చేసి కోట్ల మంది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. సమ్మె వల్ల దసరా సీజన్ లోనే రూ.125 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. సెప్టెంబరు నెల పని చేసినప్పటికీ.. వేతనాలు చెల్లించక పోవడం.. రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. అప్పు చేసైనా జీతాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. జీతాలు అందక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇరువురి వాదనల అనంతరం న్యాయస్థానం విచారణను ఈనెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ప్రభుత్వం స్పందించేలా గవర్నరే చొరవ చూపాలి'