తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవలే ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై చర్చించిన సీఈసీ... కొవిడ్ ఉద్ధృతి తగ్గేవరకు ఎన్నికల నిర్వహణ ఉండదని పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీ సూచించింది.
తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవి కాలం వచ్చే నెల 3తో ముగియనుంది.