కరోనా విస్తృతిని కట్టడి చేసే దిశగా.. ఏపీలో నేటి నుంచి విధించిన రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ రాకపోకలు, వాణిజ్య లావాదేవీలపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నిర్దేశించిన అత్యవసర సేవలు మినహా.. ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విపత్తు నియంత్రణ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.
కర్ఫ్యూ నుంచి వీరికి మినహాయింపు
ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ఫార్మసీలు, మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, బంకులు, విద్యుత్ సంస్థల కార్యాలయాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల సేవలు, విమాన, రైల్వే ప్రయాణికులు, వైద్యులు, సిబ్బంది రాకపోకలు, అత్యవసర రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర రవాణా వంటి సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వివరించింది. అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: సీఎం కేసీఆర్