కొవిడ్-19 నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలే కాకుండా... ప్రత్యేకించి మహిళలు ఇంటా బయటా పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆధ్వర్యంలో వాష్- డబ్ల్యూఏఎస్‌హెచ్ పేరిట నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు శౌచాలయాల నిర్మాణానికి చేయూత ఇస్తోంది.
వంద పంచాయతీల దత్తత..
ప్రధాని మోదీ అంకురార్పణ చేసిన ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ్ భారత్ మిషన్ విజయవంతంగా అమలవుతున్న తరుణంలో భాగంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో స్వచ్ఛత ఉద్యమం, పారిశుద్ధ్యంపై మహిళల్లో అవగాహన కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2000 గ్రామాల్లో పారిశుద్ధ్యం కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్న నాబార్డ్.. తెలంగాణలో సైతం 100 గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుని పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ సంస్థ సీజీఎం వైకే రావు తెలిపారు.
అభివృద్ధి కోసం పారిశుద్ధ్యం..
గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక చేయూత ఇస్తున్న నాబార్డ్... వ్యవసాయేతర రంగాలకు కూడా ప్రోత్సాహం ఇస్తోంది. 'చిరు ప్రయత్నం గొప్ప ప్రగతి' పేరిట 'అభివృద్ధి కోసం పారిశుద్ధ్యం' అనే నినాదం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాబార్డ్ ప్రణాళికాబద్ధంగా చర్యలకు ఉపక్రమించింది. పల్లెల్లో పేదలు బహిర్భూమికి వెళ్లడం అంటే ఇబ్బందులు పెంచుకోవడమే. జబ్బులు, అతిసారం, నీళ్ల విరేచనాలు, కరోనా వైరస్, భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, మహిళలకు భయం, సిగ్గు వంటి అంశాలు దృష్ట్యా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకుని నీటి కనెక్షన్ పొందడం ద్వారా సులభతర పరిష్కారాలు పొందవచ్చు. ఇంటి లోపల శౌచాలాయం నిర్మాణానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది.
రాయితీగా రూ.12 వేలు..
స్వయం సహాయక బృందాలు, బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల నుంచి సులభంగా రుణాలు పొందే వీలుంది. ఒక శౌచాలయ నిర్మాణానికి రూ.20 వేల ఖర్చు అయితే నాబార్డ్ రూ.12 వేలు రాయితీ లభిస్తుంది. ఇక లబ్ధిదారులు వెచ్చించాల్సింది కేవలం రూ.8 వేలే. అది కూడా స్వల్పకాలిక రుణం రూపంలో లభ్యమవుతుంది.
ఉద్యమ స్ఫూర్తి చాటాలి..
మహాత్మాగాంధీ ఆశయ సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వాష్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నాబార్డ్ నిర్ణయించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు సాగుతున్న దృష్ట్యా స్వచ్ఛతా ఉద్యమం స్ఫూర్తిని చాటాలని నిర్ణయించింది.
ఇవీ చూడండి: వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్‌ప్లాంట్లతో రైతన్నకు లాభం