Komatireddy Rajagopal Reddy resignation: రాష్ట్రంలో చాలా రోజులుగా నడుస్తోన్న మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన రాజగోపాల్‌రెడ్డి.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు. రాజీనామా నిర్ణయం తన స్వార్థం కోసం కాదని.. మునుగోడు అభివృద్ధి కోసమేనని ఉద్ఘాటించారు. ప్రజలు కోరుకుంటే మళ్లీ పోటీ చేస్తానన్న రాజగోపాల్.. ఏ పార్టీలో చేరాలనేది మునుగోడు ప్రజలతో చర్చిస్తానన్నారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు.
రాజీనామా అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ విమర్శించను అంటూనే.. తనలో ఉన్న అక్కస్సును వెలిబుచ్చారు. 20 ఏళ్లు కాంగ్రెస్‌ను తిట్టిన వ్యక్తి చెప్తే ఇప్పుడు తాము వినాలా..? అంటూ అక్కస్సు వెల్లగక్కారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తికి సీఎం పదవి కూడా ఇస్తారా?.. అంటూ అధిష్ఠానానికి పదునైన ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు గౌరవం ఉండొద్దా..? అని నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న వాళ్లకు పదవులు దక్కలేదని వాపోయారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లడలేదన్న రాజగోపాల్‌రెడ్డి.. కమిటీల ఏర్పాటులో సీనియర్ నేతలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
"ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి అనే మాట చెబుతున్నారు. నేను రాజీనామా చేస్తే అక్కడి ప్రజలకు లబ్ధి జరుగుతుందంటే చేద్దామనుకున్నా. కానీ.. రోజురోజుకూ చర్చ పక్కదారి పడుతోంది. గిట్టని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కవ సమయం వేచి చూసేదానికంటే మీ మనసులో ఏమనుకుంటే అలా చేయండి అని మునుగోడు ప్రజలు చెప్పారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావిస్తున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలి. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందాలా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి వద్దా? ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా? నా రాజీనామాతో మునుగోడుకు మేలు జరుగుతుందని భావిస్తున్నా. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నా నిర్ణయం వల్ల బాధ కలిగితే క్షమించండి. నా నిర్ణయాన్ని స్వాగతించి నాతో రావాలని కోరుతున్నా. నా పోరాటం కుటుంబ పాలనపై. తెలంగాణలోని 4కోట్ల ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే చాలా గౌరవం. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ నష్టపోయింది. దేశంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో అరాచక పాలన పోవాలంటే భాజపాతో కలిసి పనిచేయాల్సిన అవసరముంది." -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
మూడున్నరేళ్లుగా మనుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడుకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కొత్తగా ఇస్తామన్న పింఛన్లు, రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థికసాయం.. ఇలా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇస్తూ మిగతా పథకాలను రద్దు చేశారని ఆక్షేపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్‌మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని.. ఏడేళ్లు దాటినా 50శాతం పనులు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం రీడిజైన్ చేసి ఆఘమేఘాల మీద నిర్మించారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అని ప్రజలకు అర్థమైందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడం మోదీ, అమిత్ షాతోనే సాధ్యమన్నారు. ఓపెన్ గ్లోబల్ టెండర్లలో తమ కంపెనీకి టెండర్ దక్కిందని.. ఇందులో రాజకీయానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. ఒక ఎస్సీ నేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ సహించలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకొన్నారు. అర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు దళితబంధు పథకం తెచ్చారు. నయా నిజాం మాదిరిగా కేసీఆర్ తెలంగాణను పరిపాలిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉంది. డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వ్యక్తినైతే 2014 నుంచి ఎన్నో సార్లు తెరాస నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించా. కోమటిరెడ్డి సోదరులు అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. సొంత వ్యాపారంలో సంపాదించుకున్నది ప్రజల కోసం ఖర్చు చేస్తున్నా. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదు. అధికార యంత్రాంగమంతా కేసీఆర్ అదుపు ఆజ్ఞలో ఉంది. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణను సాధించుకున్నట్లు ఉంది. అనుకూలంగా ఉన్నవారికి రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారు. అనేక విధాలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించారు. అవమానాలు భరించలేక రాజీనామా చేయాలని అనుకున్నా. తెరాస ప్రభుత్వం వల్ల మునుగోడు ప్రజలకు అనుకున్న స్థాయిలో చేయలేకపోయాను. నేను రాజీనామా చేస్తే మునుగోడు సమస్యలు పరిష్కారం అవుతాయని భావించా. ఉపఎన్నిక వస్తే కేసీఆర్ హామీలు నెరవేరుస్తారని భావించా. మునుగోడు ప్రజలకు నా రాజీనామా మేలు చేస్తుందని భావిస్తున్నా." -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
ఇవీ చూడండి: