Lagacharla Incident Update : లగచర్ల ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వీరందరినీ పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో 16 మంది గ్రామస్థులు కాగా, ఇంకొకరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వీరిలో పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపించగా, మిగతా 16 మందిని పరిగి నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. ఈ నెల 11వ తేదీన లగచర్లలో అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఘటనపై వివరాలు సేకరిస్తున్న డీజీ మహేశ్ భగవత్ : మరోవైపు లగచర్ల ఘటనపై వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీ మహేశ్ భగవత్ వివరాలను సేకరిస్తున్నారు. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లోనూ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే : ఈ నెల 11వ తేదీన కొడంగల్‌లోని లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సంబంధించి అక్కడి గ్రామాల్లో భూసేకరణ నిమిత్తం ఆ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడి వెళ్లారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, అసలు తమకు ఫార్మా కంపెనీనే వద్దని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కలెక్టర్, ఇతర అధికారులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. కలెక్టర్ కారుపై రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న ఇతర అధికారులపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనతో దుద్యాల మండలం లగచర్ల, పులిచర్ల కుంట, రోటిబండ తండాలు వార్తల్లో నిలిచాయి.
అధికారులపై దాడి ఘటనను డీజీపీ సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ క్రమంలో ఆ గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. అలా ఆ అర్ధరాత్రి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారిలో 34 మందిని విడిచిపెట్టగా, 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజుల నుంచి అక్కడ పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులు భయంభయంగా గడుపుతున్నారు.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?
పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ - రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన