రాష్ట్రంలోని నగరాలు, పురపాలక పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల రుసుం, ఇతర ఛార్జీలను నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు పురపాలకశాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. క్రెడాయ్ సహా వివిధ నిర్మాణ సంఘాల వినతి మేరకు స్థిరాస్తి వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. భవన నిర్మాణ అనుమతుల ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జీలు, బెటర్‌మెంట్ ఛార్జీలు, క్యాపిటలైజేషన్ ఛార్జీలు అన్నింటిని నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫీజులను నాలుగు అర్థసంవత్సరం వాయిదాల్లో చెల్లించవచ్చని తెలిపింది. మొదటి వాయిదాను మాత్రం అనుమతి పొందినట్లు సమాచారం లేఖ అందిన 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. డెవలపర్, బిల్డర్ ఏక మొత్తంలో చెల్లింపునకు ముందుకు వస్తే భవన నిర్మాణ/లేఅవుట్ అనుమతి ఛార్జీల్లో ఐదు శాతం రాయితీ ఇస్తారు. నిర్దేశించిన వాయిదాల్లో పోస్ట్‌డేటెడ్ చెక్‌లు ఇచ్చిన మేరకు మిగిలిన మొత్తాన్ని చెల్లిండంలో విఫలమైతే ఆలస్యానికి 12శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు స్వీకరించే దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు.
భవన నిర్మాణ అనుమతుల సమయంలో పురపాలక, నగరపాలక సంస్థలకు మార్టిగేజ్ చేసే 10శాతం బిల్డప్ ఏరియాకు రిజిస్టేషన్ అవసరంలేదని పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చేయకుండా 10శాతం బిల్డప్ ఏరియాను మార్టిగేజ్ చేస్తున్నట్లు నోటరీ ఆఫిడవిట్ ఇస్తే సరిపోతుందని పేర్కొంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆఫిడ్‌విట్‌లను పురపాలక కమిషనర్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభైన తరువాత రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చి వాటిని నిషేదిత ఆస్తులు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.