పురపాలక ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పిటిషన్‌పై వాడీవేడీగా వాదోపవాదాలు జరిగాయి.
నిబంధనలకు విరుద్ధం
పురపాలక చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదించారు. గత నెల 23న షెడ్యూలు జారీ చేశారని... ఆ తర్వాత ఈ నెల 4న రిజర్వేషన్లు ఖరారు చేశారని నిబంధనల ప్రకారం ఇది విరుద్ధమని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత కనీస సమయం ఇవ్వకుండానే నోటిఫికేషన్ జారీ చేస్తున్నారని... దీనివల్ల రాజకీయ పార్టీలకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదించారు.
అది సమాచారం మాత్రమే!
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఖరారైన వార్డుల విషయంలో అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు ఇబ్బందిగా ఉంటాయని హైకోర్టు దృష్టికి ప్రకాశ్ రెడ్డి తీసుకెళ్లారు. షెడ్యూలు ఇచ్చిన తర్వాత, రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ... రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ... గత నెల 23న ఇచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ కాదని... పురపాలక చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం... ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన సమాచారం తెలిసే విధంగా నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చామని తెలిపారు. 7వ తేదీన నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్నామని... అదే అసలైన నోటిఫికేషన్ అని హైకోర్టుకు సీవీ మోహన్ రెడ్డి తెలిపారు.
పిటిషన్ కొట్టివేత
సీవీ మోహన్ రెడ్డి వాదనలపై ప్రకాశ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఒకవేళ 23న ఇచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ కాకపోతే.... 7న విడుదల చేసే నోటిఫికేషన్‌ను 17న ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని హైకోర్టును ప్రకాశ్ రెడ్డి కోరారు. జనవరి 22న కాకుండా ఫిభ్రవరి 2న ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ప్రకారం జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందని... ఆ రోజు సంక్రాంతి పండుగ ఉండటం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రకాశ్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం... ఎన్నికలను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.