పురపాలక ఎన్నికల కోసం ప్రకటించిన వార్డుల వారీ ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తైంది. 31వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించారు. చాలా చోట్లా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బోగస్, ఓట్ల గల్లంతుకు సంబంధించి ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఒకే ఇంటినంబర్ మీద ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉండడం, నిర్మాణాలు లేని చోట కూడా ఇళ్లు చూపి ఓటర్లను నమోదు చేయడం లాంటి ఉదంతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పులు దొర్లినట్లు భారీగా ఫిర్యాదులు
శాసనసభ నియోజకవర్గాల వారీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి ప్రస్తుత ముసాయిదాలో లేకపోతే మాత్రమే మున్సిపల్ కమిషనర్లు చేర్చేందుకు సాధ్యమవుతుంది. మిగతా చేర్పులు, తొలగింపులు ఈఆర్వోనే చేయాల్సి ఉంటుంది. తమకు వచ్చిన ఫిర్యాదులను మున్సిపల్ కమిషనర్లు ఈఆర్వోలకు పంపుతున్నారు. అటు ఓటర్ల గుర్తింపు ప్రక్రియలోనూ తప్పులు భారీగా దొర్లినట్లు ఫిర్యాదులు అందాయి. రిజర్వేషన్ల ఖరారు కోసం పురపాలక శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓటర్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాతో పాటే ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ముసాయిదాను ప్రకటించారు. అత్యంత కీలకమైన ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో స్థానిక అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వేషన్లు మారే అవకాశం
దాదాపుగా అన్ని పురపాలక సంఘాల్లోనూ ఓటర్ల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. కీలకమైన రిజర్వేషన్లను ప్రభావితం చేసే ఈ గుర్తింపు ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగానే తప్పులు దొర్లాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక వర్గం ఓటర్లను మరో వర్గంగా చూపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వార్డుల స్థాయిలో కొన్ని ఓట్ల వివరాలు తప్పుగా నమోదైనా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చేలా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రభావితం చేసేలా కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా అనుమానాలున్నాయి. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా ఓటర్ల ఇంటిపేర్లు, కులవృత్తులు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఓటర్ల వర్గీకరణ చేయడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
రేపు సాయంత్రానికల్లా తుది జాబితా
వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులన్నింటినీ అధికారులు ఇవాళ, రేపు పరిష్కరించాల్సి ఉంటుంది. రేపు సాయంత్రానికల్లా వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాలను ప్రకటించాలి. ఓటర్ల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆయా సామాజిక వర్గాల వారీగా, వార్డుల వారీ ఓటర్ల వివరాలు కూడా ప్రకటించాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపడతారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్