ఒక యూట్యూబ్ పాఠం జీవితాన్ని మార్చేస్తుందా?... ‘జీవితాన్ని నిలబెట్టుకునే స్థైర్యాన్ని అయితే ఇస్తుంది. యూట్యూబ్ ద్వారా నేను చెప్పే టైలరింగ్ పాఠాలని నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న మహిళలే ఇందుకు ఉదాహరణ’ అంటారు రమ. నాలుగేళ్ల క్రితం దినపత్రికలో చూసి యూట్యూబ్ ఛానెల్స్ గురించి తెలుసుకున్న ఆమె ‘ముద్ర వీడియోస్’ పేరుతో ఓ ఛానెల్ ప్రారంభించారు. అంతకుముందు పన్నెండేళ్లపాటు టైలర్‌గా చేసిన రమ మహిళలకు శిక్షణ కూడా ఇచ్చేవారు. బయటకు వచ్చి కుట్టుపని నేర్చుకునే వెసులుబాటు లేని మహిళలకోసం ఈ ఛానెల్‌ని ప్రాంభించారామె. బ్లౌజులు, డ్రెస్‌లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టాలో బేసిక్స్ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ చేసిన తొలివీడియోనే వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
అప్పుడే ఆమెకు ఎంత మంది మహిళలు టైలరింగ్ నేర్పే వీడియోల కోసం నెట్‌లో వెతుకుతున్నారో అర్థమైంది. దాంతో క్రమం తప్పకుండా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. టైలరింగ్‌పై ఏమాత్రం అవగాహన లేని వారి దగ్గరనుంచి నైపుణ్యం కలిగిన వారికి సైతం ఉపయోగపడేలా.. ఈ మూడున్నరేళ్లలో దాదాపు 1,200 వీడియోలు అప్‌లోడ్ చేసి.. 13 కోట్లకు పైగా వ్యూస్‌ని సంపాదించుకున్నారు. ఏడున్నర లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
‘‘లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన వారిలో చాలామంది నా వీడియోల ద్వారా పని నేర్చుకుని ఉపాధి పొందామని చెప్పారు. అంతకంటే సంతోషమేముంటుంది నాకు. ఇక నేరుగా నేర్చుకోవాలనుకొనే వారి కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నోట్స్ ఇస్తూ.. వారానికోసారి లైవ్ జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నా. ఇందుకోసం నామమాత్రపు రుసుము తీసుకుంటున్నాను. ఈ క్లాసులకు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలే కాదు... ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉంటున్నారు వారు కూడా హాజరవుతున్నారు. వెస్టిండీస్, కెనడా, యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండే ఈ తరగతులకు హాజరవుతున్నారు’ అనే రమ రెండేళ్లుగా పూర్తి సమయాన్ని యూట్యూబ్ వీడియోలు, టైలరింగ్ శిక్షణకే కేటాయిస్తున్నారు.
- ఇదీ చదవండి : ప్రకృతితో మమేకమైంది.. ఆమె సాగు అద్భుతమైంది..!