భాజపాకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల పోరాటంపై లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో 10 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటంపై భాజపా అగ్రనాయకత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఆక్షేపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్లో విశ్వసనీయత కోల్పోయాయని రేవంత్రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. మోదీ తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లేనని... ఆ చట్టాలు అంబానీ, అదానీల కోసమేనని ఆరోపించారు. మోదీ కొత్త చట్టాలను విపక్షాలు, సొంత పార్టీ సీఎంలు, ఎన్డీయే పక్షాలే వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్యలు జరుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ నేరపరిశోధనా విభాగం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 468 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 2018 ఎన్నికల లక్ష రుణమాఫీ హామీని కేసిఆర్ ఇంకా అమలు చేయలేదన్నారు. ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని... ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ బందులో ప్రత్యక్షంగా పాల్గొని జై కిసాన్ నినాదాలు చేయాలని సూచించారు.