MP Raghurama On Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని వైకాపా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల న్యాయస్థానం- దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో ఆయన పాల్గొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదని పేర్కొన్నారు.
అమరావతి రూపశిల్పి చంద్రబాబు అని రఘురామ కొనియాడారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొందించారని వెల్లడించారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
ఇదీ చదవండి: రేపు దిల్లీకి మంత్రుల బృందం.. ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు