ఈ ఆరేళ్లలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి , దేశానికి ఆదర్శంగా నిలిచారో అలాగే జమ్ముకశ్మీర్‌లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని తెరాస లోకసభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణపై శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఎంపీ నామ పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్ముకశ్మీర్ బిల్లు 2019లో లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు తెరాస పూర్తి మద్దతు ఇచ్చిన విషయాన్ని నామ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు తెరాస మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ చట్ట సవరణపై మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ప్రతి ఒక్కరూ ఆ రాష్ట్రాభివృద్ధికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నానని నామ అన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు భర్తీ చేయాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల మంజూరులో వ్యత్యాసం కనిపిస్తుందని , ఐఏఎస్‌కు సంబంధించి 208 పోస్టులకు గాను కేవలం 136 మంది ఉండగా , ఐపీఎస్‌కు సంబంధించి 140 మందికి గాను 105 మంది మాత్రమే ఉన్నారని అన్నారు . ఈ పోస్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చక్కదిద్దాలని సభలోనే ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సభలో నామ ప్రసంగానికి అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా