MP Komatireddy Venkat Reddy News : ప్రజలకు ఏం చేసిందని తెరాస పార్టీ కోట్ల రూపాయల ఆర్భాటాలతో ప్లీనరీలు నిర్వహించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగి వరి కోతలు ప్రారంభమైనా.. ఇప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తీసుకువచ్చిందని ఆరోపించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని.. కక్షపూరితంగా నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని విమర్శించారు.
రేవంత్ సభకు రాను: తెలంగాణలో రాహుల్ సభ కోసం రేపు నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు సన్నాహక సమావేశానికి హాజరు కావటంలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అధికార కార్యక్రమాల కారణంగా సన్నాహక సమావేశానికి వెళ్లడం లేదని చెప్పారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా... బలహీనపడిన ఆదిలాబాద్, నిజామాబాద్‌లో జనసమీకరణపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.
నా జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠం : "నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉంది. వేరే నేత వచ్చి నల్గొండలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల సమీక్షలు పెట్టుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తేస్తాం. కేసీఆర్ పొత్తు అడిగినా మా అధిష్ఠానం ఒప్పుకోలేదు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణం. నా నియోజకవర్గంలో గడ్కరీ కార్యక్రమాలు ఉండటం వల్లే రేపు నల్గొండలో రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరు కావట్లేదు."
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ
విద్యార్థినికి సాయం: ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారికి సాయం చేసేందుకు ముందుండే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తన దాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఎంబీబీఎస్ సీటు సాధించి.. ఆర్థికపరమైన కష్టాల వల్ల ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్న అనూష అనే విద్యార్థిని సాయం చేయడానికి వెంకట్ రెడ్డి ముందుకొచ్చారు. అనూష వైద్య విద్య పూర్తయ్యి.. తనని డాక్టర్ చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ఆమె డాక్టర్ అవ్వడానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగాన్ని మూలకు పడేసిందని కోమటిరెడ్డి ఆక్షేపించారు. తెలంగాణలో 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. సర్కార్ విద్య సరిగ్గా ఉంటే.. అనూష లాంటి పరిస్థితి వేరే విద్యార్థులకు రాదని అన్నారు.
ఇవీ చదవండి :