ఏపీ అమరావతి రైతులు మరోసారి ఉద్యమ గర్జన చేశారు. రాజధాని శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన వేళ రైతులు మరోసారి కదం తొక్కారు. చలో ఉద్ధండరాయునిపాలెం అంటూ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి పాదయాత్ర చేశారు. గుంటూరులోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి అమరావతి ఐకాస నేతలు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి రైతులు ముందుకు సాగారు. గోరంట్ల, లాంఫాం, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు మీదుగా పాదయాత్ర నిర్వహించారు. కొందరు ప్రధాని మోదీ చిత్రపటాలు పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన ప్రధానికీ అమరావతిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేయడమే మహాపాదయాత్ర ఉద్దేశమని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
పాదయాత్ర మధ్యలో వివిధ గ్రామాల్లోని రైతులు, నేతలు జతకలిశారు. తాడికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించగానే. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వారితో కలిసి ముందుకు సాగారు. తాడికొండ అడ్డరోడ్డుకు చేరే వరకు స్థానికులు ఎండను లెక్కచేయకుండా ఎదురుచూశారు. ఆ తర్వాత అందరూ కలిసి ఉద్ధండరాయునిపాలెం వెళ్లారు.
సర్వమత ప్రార్థనలు
రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు చలో ఉద్ధండరాయునిపాలెం కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఎర్రబాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం రైతులు మందడం దీక్షా శిబిరం నుంచి బయల్దేరగా.. రాయపూడి నుంచి మరికొన్ని రైతు కుటుంబాలు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లాయి. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ దారి పొడవునా మహిళలు నినదించారు. మహా పాదయాత్రలో రాయపూడి, వెలగపూడి, ఐనవోలు గ్రామాల రైతుల ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ సర్వమత ప్రార్థనలు చేశారు. 13 జిల్లాల పేరుతో పుణ్యస్థలి వద్ద పొంగళ్లు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజధానిగా అమరావతి కొనసాగేటట్లు ప్రధాని మోదీ చొరవ చూపాలని రైతులు, మహిళలు విన్నవించారు.
పలు పార్టీల మద్దతు
రాజధాని రైతులు, మహిళల ఆందోళనకు పలు పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. మోదీ మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశాయి. తెలుగుదేశం పార్టీ తరవున ఎంపీ గల్లా జయదేవ్, వర్ల రామయ్య, గద్దె అనురాధ, శ్రావణ్ కుమార్, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. అమరావతి కోసం గతంలో జైలుకి వెళ్లానని.. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఎంపీ జయదేవ్ స్పష్టం చేశారు.
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత
ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఉద్దండరాయునిపాలెం వద్ద సభ నిర్వహించారు. వీరికి వ్యతిరేకంగా, 3 రాజధానులు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉద్దండరాయునిపాలెం వచ్చారు. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారి వేడెక్కింది. ఉద్యమం చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కార్యక్రమంలో భాగంగా రాత్రి వేళ కాగడాలు, కొవ్వొత్తులతో శిబిరాల వద్ద రైతులు ప్రదర్శన చేపట్టారు. అమరావతి వెలుగు..ఆంధ్రప్రదేశ్ వెలుగంటూ నినాదాలు చేశారు.
ఇవీచూడండి: మహా పాదయాత్రతో ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు