motivational class రాధిక స్నేహితుడు అకస్మాత్తుగా మాట్లాడటం మానేశాడు. అప్పటివరకు ప్రాణ స్నేహితుడినని చెప్పే అతను అలా దూరమయ్యేసరికి ఆమెకు ప్రపంచమంతా చీకటై, తనను తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. అలాకాకుండా ఎదుటివారి నుంచి వచ్చే తిరస్కరణనైనా హుందాగా స్వీకరించి, ముందుకు సాగాలంటున్నారు నిపుణులు.
తిరస్కరణ స్వీకరించాలి: ఒకరంటే మరొకరికి ప్రాణంగా ఉండేవారెందరో విడిపోతుంటారు. ఒకరికొకరు నీడలా మారినవాళ్లూ దూరమవుతుంటారు. స్నేహం లేదా ప్రేమ ఎందులోనైనా.. మానవ సంబంధాల్లో ఇవన్నీ సాధారణ విషయాలే అంటున్నారు నిపుణులు. అటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. న్యూనతకు గురికాకూడదు. కొందరు ఇటువంటి సందర్భంలో తమను తామే తక్కువగా భావించడం, ఆత్మనింద మొదలుపెడతారు. ఇది సరైనది కాదు. ఈ సమయంలోనే ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వకుండా, ఆత్మబలాన్ని పెంచుకుంటూ ఎదుటివారి తిరస్కరణను స్వీకరించగలిగే స్థాయికి చేరుకోవాలి.
మనసుకు నచ్చినట్లు: తిరస్కరణ అనుభవం నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. మరోసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇకముందు జాగ్రత్తగా అడుగులేయాలి. అప్పటివరకు మీకే లక్ష్యమూ లేకపోతే కొత్త లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించాలనే పట్టుదల తెచ్చుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉత్సాహపడాలి. మనసుకు నచ్చింది కూడా అప్పటివరకు చేయలేకపోతే, తిరిగి దాన్ని ప్రారంభించాలి. జీవితం చాలా విలువైంది. అందులో ఇటువంటి సందర్భాలు కూడా ఒక భాగం మాత్రమే అని గ్రహించాలి. ఒంటరిగా అయ్యామనే భావన నుంచి ఒంటరిగానైనా అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే చాలు. ఎదుటివారి తిరస్కరణ కూడా మీ ఎదుగుదలకు కారణం కావొచ్చు.
ఇవీ చదవండి: