మావోయిస్టు పార్టీలో ముఖ్యంగా కేంద్ర కమిటీ(సీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 25 మంది సభ్యులు ఉండగా.. వారిలో 11 మంది తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రస్థానంగా ఉండేది.
గత కొంతకాలంగా వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో క్యాడర్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వయోభారంతో గణపతి పదవి నుంచి తప్పుకొన్న తర్వాత నంబాల కేశవరావును సీసీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక.. కేంద్ర కమిటీని పటిష్ఠపరిచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకప్పుడు 17 మంది సభ్యులకు పడిపోయిన కేంద్ర కమిటీ ఇప్పుడు 25 మందికి చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
కేంద్ర కమిటీలో తెలంగాణ సభ్యులు: గణపతి, మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణరెడ్డి, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, గాజర్ల గణేశ్, పాక హనుమంతు, కట్టా రామచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సభ్యులు: నంబాల కేశవరావు, అక్కిరాజు హరగోపాల్, సుధాకర్.