విష జ్వరాల ధాటికి... రాష్ట్రంలోని పల్లెలన్నీ పడకేశాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. గత ఐదు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1348 డెంగీ కేసులు నమోదు కాగా... సుమారు లక్షా 31 వేల మంది విష జ‌్వరాల బారిన పడినట్లు అధికారిక లెక్కల్లో తేలింది. ఇందులో సుమారు 50 శాతం మంది చిన్నారులే ఉండటం గమనార్హం. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు రోజుకు 2 వేలకు పైగా ఓపి కోసం వస్తున్నారు.
ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఇదే పరిస్థితి
రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 3 వేల 663 టైఫాయిడ్ పరీక్షలు చేయగా... వెయ్యి 36 మందికి ఉన్నట్లుగా నిర్ధారించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గౌరయపల్లిలో శైలజ అనే విద్యార్థిని డెంగీతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
విష జ్వరాల విజృంభణ.. మంచం పట్టిన పల్లెలు..!
ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తోంది. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో క్లినిక్‌లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.