ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ అమలుకోసం మరిన్ని నిబంధనలు రూపొందించింది. ద్విచక్రవాహనంపై ఒకరు, నాలుగు చక్రాల వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని స్పష్టం చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్యచికిత్స కోసం మినహా ఎవరూ రహదార్లపైకి రాకూడదని తెలిపింది. సాయంత్రం ఆరున్నర తర్వాత ఆసుపత్రులు, మెడికల్ షాపులు తప్ప ఏవీ తెరవకూడని పేర్కొంది.
నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాల నుంచే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించింది. లాక్‌డౌన్ సమయంలో బీమా సేవలు అందించే వారికి అనుమతి ఉంటుందని తెలిపింది. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల కమిషనర్, రవాణాశాఖ కమిషనర్, హైదరాబాద్ ఐజీ, ఔషధ నియంత్రణ డైరెక్టర్, ఉద్యానవనశాఖ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్, తూనికలు కొలతల డైరెక్టర్, పాడిపరిశ్రమాభివృద్ధి ఎండీ సభ్యులుగా నియమించింది.
ఇదీ చూడండి: బైక్‌పై ఒకరు... కారులో ఇద్దరు... అంతే: సీఎస్