హైదరాబాద్ నగరంలో కూలి పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న వారు కరోనా కారణంగా సొంతూళ్లకు చేరుకున్నారు. ఉపాధి దెబ్బతినడంతో వారి ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్చేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామాల్లో ప్రైవేటు బడులు లేకపోవడం, మండల కేంద్రాల్లో ఉన్నా అవి ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేకపోవడం, తెరుచుకున్నా కరోనా కాలంలో వాహనాల్లో పిల్లల్ని పంపడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనూ ఎక్కువ మంది ఆ వైపు మొగ్గుచూపుతున్నారు.
మేడ్చల్ జిల్లాలోని 495 పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నాటికి 4,324 మంది ప్రవేశాలు పొందారు. అందులో ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి చేరిన వారి సంఖ్య 806(18.60 శాతం) అని అక్కడి విద్యాధికారులు లెక్క తేల్చారు. నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 6-10 తరగతుల్లో 40 మంది చేరగా, వారిలో 25 మంది ప్రైవేటు బడుల నుంచి వచ్చిన వారేనని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే కన్పిస్తోంది. ‘ప్రైవేటు బడుల్లోనూ ఆన్‌లైన్ పాఠాలే కావడం, పైగా రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సి రావడం, ఆర్థిక స్థితి అందుకు సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పలువురు తల్లిదండ్రులు తెలిపారు’ అని పలువురు ప్రధానోపాధ్యాయులు వివరించారు. ‘ఈ నెల 1 నుంచి ప్రవేశాలకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు సర్కారు అనుమతి ఇచ్చింది. సాధారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కలిపి 2.85 లక్షల మంది విద్యార్థులు చేరతారు. ఈ సారి 5-10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా’ అని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇవిగో ఉదాహరణలు
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో 42 మంది ప్రైవేట్ విద్యార్థులు చేరారు.
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్ద్యారంలోని ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో 10 మంది చేరారు. అందులో నలుగురు అయిదో తరగతి వరకు ప్రైవేటులో చదివిన వారే.
- జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో 11 మంది, మాదాపూర్ ఉన్నత పాఠశాలలో 20 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ హైస్కూల్‌లో 10 మంది, పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ హైస్కూల్‌లో 10 మంది ఇలా ప్రవేశాలు పొందినవారే.
- మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం కౌకూరు హైస్కూల్‌లో ఇప్పటివరకు 32 మంది ప్రవేశాలు పొందగా వారిలో ఆరుగురు ప్రైవేటు విద్యార్థులేనని ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండిః ప్రైవేటు బడుల్లో ఫీజులు వసూలు కాక.. ఆర్థిక భారం మోయలేక!