సైబర్ నేరస్థులు పంజా విసిరినప్పుడు.. బాధితుల నగదు బదిలీ జరిగిన బ్యాంకు ఖాతాలు, ఈ-వ్యాలెట్ల ఆధారంగానే పోలీసుల దర్యాప్తు మొదలవుతుంది. పోయిన సొమ్ము ఏ ఖాతాలో జమైందో ఆరా తీసి.. సంబంధిత ఖాతాదారుల వివరాలు సేకరిస్తారు. నగదునూ ఫ్రీజ్ చేస్తారు.
దొరకని మోసగాళ్ల ఆనవాళ్లు..
అయితే చాలా ఘటనల్లో... నగదు చేరిన ఖాతాలు బినామీలవి కావడం వల్ల పోలీసుల దర్యాప్తు అక్కడే ఆగిపోతోంది. అసలైన మోసగాళ్ల ఆనవాళ్లు అధికారుల వలకు చిక్కట్లేదు. ఖాతాల్లో డబ్బు చేరిన వెంటనే... అసలైన సూత్రధారి డ్రా చేయించేయడమూ ఒక కారణంగా భావిస్తున్నారు. బినామీలకు కమీషన్లు ఇస్తూ మిగిలిన సొమ్మును వీలైనంత త్వరగా విదేశాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారాలు పకడ్బందీగా నడుస్తుండటం వల్ల... పోగొట్టుకున్న సొమ్ము పూర్తిస్థాయిలో బాధితుల చేతికి తిరిగి అందడం లేదు.
పథకంతోనే మోసాలు..
ఇలాంటి సైబర్ నేరాలకు ఎక్కువగా నైజీరియన్లు పాల్పడుతున్నట్లు ఏపీలోని విజయవాడ పోలీసులు వెల్లడించారు. దిల్లీ, నోయిడా, కోల్‌కతా, భరత్‌పూర్ వంటి ప్రాంతాల నుంచి మోసాలకు పథకం రచిస్తారని తెలిపారు. ఆర్థిక అవసరాలున్న వారితో ఖాతాలు తెరిపించి.. కాజేసిన సొమ్మును అందులోకి పంపుతారని వివరిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండండి..
నగదు లావాదేవీల సమయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు... ఆఫర్లు, నకిలీ సందేశాలతో మోసపోవద్దని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!