తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను లండన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్) ఆధ్వర్యంలో ఈ ఏడాది బోనాలను సమర్పించారు. ఏటా లండన్ వీధుల్లో ఘనంగా బోనాల జాతర, తొట్టెల ఊరేగింపును మన సంస్కృతి, సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకునేవారు. కరోనా కారణంగా ఈ ఏడాది నిరాడంబంరంగా జరుపుకున్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ... సమాజానికి వీలైనంత సేవ చేస్తున్నామని పేర్కొన్నారు.
![bonalu in london, bonalu celebration by tauk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442348_bonalu-3.jpg)
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు సమర్పించి... ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో టాక్ కార్యవర్గ సభ్యులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడిలో బోనాలను సమర్పించామని వివరించారు.
![bonalu in london, bonalu celebration by tauk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442348_bonalu-6.jpg)
చిన్న పిల్లలు ప్రత్యేక ఆకర్షణ
అందరినీ చల్లగా చూడాలని... కరోనా నుంచి ప్రజలని రక్షించాలని కోరుకున్నామని ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా... అందరం స్వీయ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమర్పించిన టాక్ సంస్థ ఆడబిడ్డలందరికీ శుష్మణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లలు టాక్ జెండాలతో, అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
![bonalu in london, bonalu celebration by tauk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442348_bonalu.jpg)
ఇంట్లోనే బోనం సమర్పణ
ఏటా బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపు, అమ్మ వారి పూజ ముఖ్య ఘట్టాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశం లేనందున... టాక్ ముఖ్య నాయకులు సురేష్ బుడగం-స్వాతి దంపతులు వారి ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా అమ్మ వారి పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. టాక్ సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
![bonalu in london, bonalu celebration by tauk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442348_bonalu-5.jpg)
ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు
టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్లకు టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి పట్ల టాక్ సేవలను అభినందించారు. బోనాల సంబురాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టాక్ సభ్యులు, లండన్ వాసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సుప్రజ, సురేశ్ బుడగం, రాకేశ్ పటేల్, సత్యపాల్, హరిగౌడ్, గణేష్, రవి రెటినేని, రవి పులుసు, మాధవ్ రెడ్డి, వంశీ వందన్, భూషణ్, అవినాశ్, వంశీ కృష్ణ, పృథ్వి, శ్రీ లక్ష్మి, విజిత, క్రాంతి, భరత్, వంశీ పొన్నం, చింటూ, రమ్య, స్వప్న, లాస్య, పూజిత, బిందు, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: balkampet yellamma: కన్నుల పండువగా బల్కంపేట ఎలమ్మ కల్యాణోత్సవం