జంటనగరాల్లో అత్యంత కీలకమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్ రైళ్లు మరో వారంలో పట్టాలెక్కబోతున్నాయి. 18 నెలల నుంచి ఇవి షెడ్డులకే పరిమితమైపోయాయి. గత ఏడాది మార్చి 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఎంఎంటీఎస్ రైలు ఇప్పటికీ.. పట్టాలెక్కలేదు. కరోనాకు ముందు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల వారు ఈ రైళ్లలోనే ప్రయాణం చేసేవారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వీలుండడంతో నగర ప్రజలు ఎక్కువగా ఎంఎంటీఎస్లోనే ప్రయాణించేవారు.
మరో రెండు రోజుల్లో..
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో.. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు నడపమని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించేందుకు పచ్చ జెండా ఊపింది. మరో రెండు రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ రైళ్లు నడిపే తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. అధికారిక ఉత్తర్వులు రాగానే ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: Gang Rape: కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం!