MLC Kavitha Blood Donation: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇందులో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపినాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. సనత్ నగర్‌లో రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఎంతోమందికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
దేశాన్ని పట్టి పిడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి పేదరికం, నిరుద్యోగం, మతతత్వం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వీటన్నింటిని సమూలంగా రూపుమాపితేనే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ముందుకెళ్తే.. భారతదేశం ఒకవైపు ఆర్థిక శక్తిగా...మరో వైపు ప్రపంచానికి దారి చూపే శక్తిగా మారుతుందని తెలిపారు.
'హైదరాబాద్‌లో తెరాస ఆధ్వర్యంలో రక్తదానం చేపట్టాం. దేశంలో పరిస్థితులు ఏంటి...? ఈ పరిస్థితులు మారడానికి.. పౌరులుగా, ప్రజలుగా మనవంతుగా ఏం చేయాలన్న అంశంపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశం బాగుపడుతుంది.అటువంటి రోజు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్దించినట్లు' అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.