Jaggareddy Comments: కాంగ్రెస్‌లో గొడవలు మళ్లీ రచ్చకెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి తీరు మారలేదని అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన గురించి శాసనసభ్యులతో, ఎంపీలతో రేవంత్‌రెడ్డి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. మీడియా ముందు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడినట్లు చెప్పారని ఆరోపించారు.
- ఇదీ చూడండి: మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. రేవంత్‌పై జగ్గారెడ్డి నిప్పులు.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
పీసీసీ అధ్యక్షుడు హోదా మరిచి.. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా గోడకేసి కొడుతా అని నాయకులను అవమాపరిచేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే... రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తాను అదే రీతిలో స్పందించానని వివరించారు. రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పానని అందుకు ఏలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కి రాజకీయంగా ఏదైనా నష్టం జరిగితే ఆ నింద తనపై పడే అవకాశం ఉందని.. తనపై నింద వేసే ప్రయత్నం కూడా రేవంత్ చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులపై వ్యూహంతో పోరాటం చేయాలని.. అలాంటి వ్యూహమేదీ రేవంత్‌రెడ్డి వద్ద లేదని జగ్గారెడ్డి ఆరోపించారు.
"రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి. రేవంత్‌రెడ్డి అందరి ఆలోచనలతో ముందుకెళ్లాలి. కానీ.. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆలోచన చేయాలి. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నా. గతంలో విభేదాలపై రేవంత్ వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. గతంలో దిల్లీలో సీనియర్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత మేము ఇప్పటివరకు మాట్లాడలేదు. పార్టీ నేతల గురించి మాట్లాడబోనని రాహుల్‌కు మాట ఇచ్చా. ఆ మాట తప్పినందుకు బాధపడుతున్నా. యశ్వంత్ పర్యటన విషయమై మాతో రేవంత్ మాట్లాడలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలతో చర్చించనట్లు మీడియా ముందు చెప్పారు. నేను మీడియా ముందు మాట్లాడే పరిస్థితి తెచ్చింది రేవంతే." - జగ్గారెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇవీ చూడండి: