రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ పాటించడం ఒకటే మార్గమని మంత్రులు స్పష్టం చేశారు. భాగ్యనగరంలో కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించిన చోట వంద శాతం లాక్డౌన్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. సభలు, సమావేశాలు, సామూహిక పంపిణీ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేపట్టవద్దని సూచించారు. ఎవరైనా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలనుకుంటే పోలీస్ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు.
కంటైన్మెంట్ జోన్లలో రోజూ ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి నివేదికను సేకరించాలని సూచించారు. అనుమానితులను ఆస్పత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయితే తక్షణమే వారి ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ వివరాలు సేకరించాలని సూచించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాబోయే పది రోజులు చాలా ముఖ్యమని.. ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రాకుండా చూడాలని ఈటల సూచించారు. అవసరమైన చోట అంబులన్స్‌లను ఉంచాలన్నారు. అనుమానితులు నుంచి శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తామన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీస్, మెడికల్, మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆరోగ్య శాఖ సెక్రెటరీ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: కంటైన్మెంట్ జోన్లకు ప్రత్యేక విధివిధానాలు