ఈటల రాజేందర్‌కు ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత లేదని తెరాస నేతలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. తెరాసలో ఈటలకు దక్కినంత గౌరవం మరే ఇతర నేతకూ దక్కలేదని కొప్పుల అన్నారు. ముఖ్యమంత్రి అభినందించినపుడు ఒకలా....తప్పులను ఎత్తిచూపినపుడు మరోలా మాట్లాడటం తగదని హితవు పలికారు.
ఈటల.. భాజపాలో చేరేందుకు 2 కారణాలు ఉన్నాయని... ఆత్మరక్షణ లేదా ఆస్తుల రక్షణ కోసమే భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. వామపక్ష భావజాలంతో ఉన్న ఈటల.. భాజపాలో ఎలా చేరుతున్నారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపాలో చేరుతున్నారో ఈటల చెప్పాలన్నారు. ఈటల సొంత లబ్ధి, ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్నారు.
సొంత భావజాలంతో నిల్చుంటే ఈటలను ప్రజలు గౌరవిస్తారని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల చెంత చేరినప్పుడే ఈటల ఆత్మగౌరవం పోయిందని కొప్పుల తెలిపారు. కారు ఓనర్లమని చెప్పి దిల్లీకి వెళ్లి క్లీనర్లుగా మారారని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. సొంత విషయాలను పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని తెరాస నేతలు ఈటలను విమర్శించారు.