రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తి కోసం స్థానికంగా చర్యలు చేపట్టాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మత్స్యశాఖ కార్యకలాపాలపై పశుసంవర్థకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రంలో 389 ఎకరాల్లో ఏర్పాటు చేసిన 24 కేంద్రాల్లో 2019-20లో 2.11 కోట్లు, 2020-21లో 2.40 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేసినట్టు చెప్పారు. మిగతా 179 ఎకరాలు వినియోగంలోకి తెచ్చి 23 కోట్ల విత్తన ఉత్పత్తి చర్యలు, ప్రైవేటు భాగస్వామ్యం, సంచార మార్కెట్ అంశాలపై చర్చించారు. సిల్ట్ తొలగింపు, పైప్‌లైన్ మరమ్మతులు, బోరుబావి ఏర్పాటుకు ఉపాధి హామీ కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రతిష్టాత్మకంగా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు కోసం మత్స్య శాఖ కోట్లాది చేప పిల్లలు పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కొత్త ప్రాజెక్టుల రాకతో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి వచ్చినందున... భారీగా చేప పిల్లలు అవసరం ఉంటుందన్నారు. నాణ్యమైన చేపలు పరిశుభ్ర వాతావరణంలో వినియోగదారులకు అందించడం, మత్స్యకారులు గిట్టుబాటు ధరలకు చేపలు అమ్ముకోవడానికి మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్య సంపద ఉత్పత్తి పెంపుతోపాటు ప్రాసెసింగ్‌కు నూతన టెక్నాలజీ వినియోగించేందుకు ఎంపెడా, ఎన్‌ఎఫ్‌డీబీల సహకారం తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్ ఫిష్ అవుట్‌లెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినందున... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషం : ఇంద్రకరణ్ రెడ్డి