పార్టీలకు అతీతంగా గోశామహల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో... దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలోని గౌలిగూడా, పఠాన్వాడీ, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో... రూ.3 కోట్లతో పురాతన నాలా, నూతన కమిటీ హాల్, కంచె మోరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలోని ఓ వార్డులో నీరు రావటం వల్ల... ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్లు గోలగోల చేశాయని మండిపడ్డారు. ప్రస్తుతం మొన్న నాలుగు రోజుల పాటు కురిసిన వర్షానికి ఎందుకు నీరు రాలేదో చెప్పాలని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.