రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన, ఐటిడిఏ ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిపై అధికారులతో ఫోన్లో ఆరా తీశారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయని నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
మరో రెండు రోజుల పాటు వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గిరిజన ప్రాంతాల కలెక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వరదల్లో, వాగుల్లో ప్రజలు ప్రమాదంలో పడకుండా తగిన హెచ్చరికలు చేయాలని, ఏదైనా అత్యవసరం ఏర్పడితే తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని వెంటనే సమాచారం అందించాలన్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం