మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలుగా రాణించలేకపోతున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. వీ-హబ్ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంత్రి సత్యవతి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో వీ-హబ్ నిర్వాహకులను అభినందించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలకు సరైన చేయూత అందిస్తే ఎవరికీ తీసిపోని విధంగా, ప్రపంచం గర్వించేలా ఎదుగుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు . తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మహిళా సాధికారత, సంక్షేమ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించడానికి వీ-హబ్ చేస్తున్న కృషి అభినందనీయం. దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళలకు గుర్తింపు తీసుకురావడం ప్రశంసనీయం. తెలంగాణ మహిళలు కష్టపడి పనిచేసేవారు, అత్యంత నిజాయితీపరులు. మన ఆడపడుచులకు అవకాశం వస్తే కచ్చితంగా తమ సత్తాను నిరూపించుకుంటారు. - సత్యవతి రాఠోడ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ అత్యంత ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారని, వారిని గుర్తించి సరైన విధంగా ప్రోత్సహిస్తే.. రాష్ట్రం గర్వించే విధంగా ఎదుగుతారని తెలిపారు. ఇప్పటికే ట్రైకార్, సెర్ప్, మెప్మా, ఆస్ట్రేలియన్ కాన్సులేటుతో వీ-హబ్ ఒప్పందాలు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల తెలంగాణ మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం