PrashanthReddy Review: సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి గల విధివిధానాలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సొంత జాగా ఉన్న లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సంబంధిత అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
సెమీ అర్బన్, అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోసారి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో కూడా సమావేశం కానున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల పరిధిలో ఏవిధంగా లబ్దిదారులను ఎంపికచేయాలనే అంశంపై చర్చించనున్నారు. అనంతరం ఆ నివేదికను మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు నివేదించనున్నారు.
సొంత స్థలం ఉండి... ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెరాస ప్రభుత్వం.. గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది. ఈ మేరకు బడ్జెట్లో మంత్రి హరీశ్ రావు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. నియోజకవర్గానికి 3వేల ఇళ్లను కేటాయించనుంది. ఈ పథకంతో.. చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు... డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తుంది. రెండు పడక గదుల నిర్మాణంతో రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలు లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. ఇప్పుడు తాజాగా స్థలం ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది.
ఇవీ చూడండి: