రాష్ట్రంలో రైతాంగానికి నాణ్యమైన నూతన వేరుశనగ వంగడాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక్రిశాట్ అభివృద్ది చేసిన నూతన వేరుశనగ వంగడాలపై సమీక్షించిన మంత్రి... ఇక్రిశాట్, భారత జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన వంగడాల ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. 80 శాతం ఓలిక్ యాసిడ్ ఉండే గిరినార్ 4, గిరినార్ 5 వంగడాలు రాబోయే యాసంగి సీజన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.
ఆలివ్ ఆయిల్లో ఉండే నాణ్యత కలిగిన ఈ నూతన వంగడాలతో... 115 రోజుల్లో పంట చేతికి వస్తుందని మంత్రి తెలిపారు. వినియోగదారులకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగమైందన్నారు. బహిరంగ మార్కెట్లో రైతులకు అధిక ధర కూడా లభిస్తుందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, అర్జెంటినా, చైనా వేరుశనగ ఉత్పత్తులతో పోటీ పడే స్థాయి ఈ వంగడాలకుందని కితాబిచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో యాసంగి సాగుకు అనుకూలమైన వంగడాలు అని మంత్రి చెప్పారు. పంట కోత సమయంలో తేమ లేమి కారణంగా ఆఫ్లాటాక్సిన్ లేని అంతర్జాతీయ నాణ్యత కలిగిన వేరుశనగ ఉత్పత్తి వస్తుందని పేర్కొన్నారు.
ఈ రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా... విత్తనాభివృద్ది సంస్థ సహకారంతో ఉత్పత్తి చేయించాలని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇక్రిశాట్ ఆసియా రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పూరన్ ఎం గౌర్, ముఖ్య శాస్త్రవేత్త జనీలా, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు