సాంప్రదాయ పంటల నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు వివిధ రాష్ట్రాల్లో పంటల సాగు, ఆహార శుద్ధి విధానాలపై అధ్యయనం చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా దేశంలోనే అతిపెద్దదైన... కర్ణాటకలోని రాంనగర్ పట్టు గుడ్ల మార్కెట్‌ను మంత్రి బృందం సందర్శించింది. మద్దూరు తాలూకా కెస్తూరులో యువ రైతులు రాజు, కుమార్, శశి, వినోద్ సాగు చేస్తున్న మల్బరీ సాగును పరిశీలించింది. మైసూరు సీఎస్ఐటీలో సంస్థ డైరెక్టర్‌తో సమావేశమైంది.
కేసీఆర్ ఆలోచన బాగుంది..
కర్ణాటక ఉద్యాన విధానాలు, ప్రపంచవ్యాప్త గిరాకీ, తీసుకోవాల్సిన చర్యలను సీఎస్‌ఐఆర్ - సీఎఫ్‌టీఆర్‌ఐ సంస్థ పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ అధిపతి డాక్టర్ విజయానంద్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలపై ప్రశంసల జల్లు కురిపించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ ఇవ్వడమే కాకుండా పంట కాలనీల ఆలోచన బాగుందని, ఉద్యాన రంగంలో రైతులను ప్రోత్సహించాలన్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ఉద్యాన సాగులో పాలీహౌస్, గ్రీన్‌హౌస్‌ల్లో రెడ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రొకోలి, టమాటా పంటలు పండించవచ్చని సూచించారు.
ఉద్యోగాలు వదిలి సాగు చేస్తున్నారు
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలు... మరే రంగమూ ప్రజలకు అంత భరోసా ఇవ్వదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్న దృష్ట్యా ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి రాకతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
వీటిపై మంత్రి బృందం అధ్యయనం
రైతులకు లాభాలు అందించే వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు పర్యటిస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో ఉద్యాన, పట్టు పరిశ్రమ రంగాల్లో అనుసరిస్తున్న విధానాలు, రైతు సహకార సంఘాల పరిస్థితి, శ్రీగంధం సాగు, హైడ్రో ఫోనిక్ పద్దతిలో ఆకుకూరల సాగు, పాలీహౌస్‌ల్లో తీగ జాతి టమాటా, క్యాప్సికమ్, బీర సాగు పద్దతులపై అధ్యయనం చేశామని వెల్లడించారు. తమిళనాడు హోసూరులో వెదురు సాగు కూడా పరిశీలించామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి వెంట... సీఎస్‌ఐఆర్ - సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి ఎ సింగ్, ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నీరజాప్రభాకర్, ఇతర అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి : 'శుభం నింపే పసుపే.. రైతులకు ఉరితాడవుతోంది'