ప్రపంచంలోని ముఖ్యమైన ప్రదేశాలైన లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేసి... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్... శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడిదారులు స్వేచ్ఛగా వస్తారని అభిప్రాయపడ్డారు. ఆరున్నరేళ్ల కిందటే సీఎం కేసీఆర్ రూ.284 కోట్లతో అత్యాధునిక పోలీస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.
65శాతం హైదరాబాద్‌లోనే..
ప్రపంచంలోనే అన్ని హంగులతో బంజారాహిల్స్‌లో రూ.600కోట్లతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దేశంలో ఉన్న సీసీ కెమరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. అంబులెన్స్‌లను కూడా కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయడం వల్ల సకాలంలో ఆసుపత్రులకు చేరుకుంటాయని సూచించారు. మహిళల రక్షణలో భాగంగా డ్రోన్ కెమెరాల వినియోగాన్ని పరిశీలించాలన్నారు.
దేశంలోనే నెంబర్ వన్
శాంతి భధ్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని... హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యధిక నిధులు కేటాయించారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో నేరాల రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు. నూతన విధానంతో నేరం జరిగిన స్థలానికి వెళ్లే ముందే పోలీస్ అధికారికి... దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ గుర్తింపు, సైబర్ నేరాలు, భౌగోళిక గుర్తింపు వంటి వన్నీ ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించే వీలుందన్నారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు:
- కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భారీ తెరపై ఏకకాలంలో 5,000 కెమెరాల్ని వీక్షించే సదుపాయం.
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద ఏర్పాటవుతున్న సీసీ కెమెరాల పర్యవేక్షించే అవకాశం.
- వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ కెమెరాల ఏర్పాటు.
- సామాజిక పోలీసింగ్‌లో భాగంగా కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల పర్యవేక్షణ.
- ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతతో అందుబాటులోకి రాబోతోన్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)తో ప్రాజెక్టులో భాగంగా కెమెరాల ఏర్పాటు.
- ఏదేని కూడలిలో ట్రాఫిక్ జాం ఏర్పడితే సిబ్బంది ప్రమేయం ఏమీ లేకుండానే సమీప కూడళ్ల నుంచి అటు వైపు వాహనాల్ని రానీయకుండా నియంత్రించి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.
- నేను సైతం ప్రాజెక్టులో భాగంగా వ్యక్తిగతంగా మూడు కమిషనరేట్లలో 10 లక్షల సీసీ కెమెరాల్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- పలు ప్రాజెక్టుల కింద ఏర్పాటు చేసే లక్షలాది కెమెరాల్ని ఈ కేంద్రం నుంచే వీక్షిస్తారు. భారీ తెరపై ఒకేసారి 5,000 కెమెరాల్ని చూడవచ్చు. అవసరాన్ని బట్టి వీలైనన్ని కెమెరాల్ని జూమ్ చేసి దృశ్యాల్ని వీక్షించొచ్చు.
- ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర ఏర్పాటు చేశారు. ఇందులో 3 వరుసల్లో వరుసకు 9 చొప్పున టీవీ స్క్రీన్‌లుంటాయి. ఒక్కో టీవీ తెర సామర్థ్యం 70 అంగుళాలు. ఈ భారీ తెర పక్కనే రెండు వైపులా మరో నాలుగేసి టీవీ తెరలు 55 అంగుళాల సామర్థ్యం గలవి ఉంటాయి.
- 20 సీటర్ కెపాసిటీతో సీసీటీవీలను వీక్షించేందుకు సీటింగ్ ఏర్పాటు చేశారు.
- ఈ కేంద్రంలోనే దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజులపాటు నిక్షిప్తం చేసి ఉంచేలా భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుకునే సౌలభ్యం ఉంది.
- ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్ రూం ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఓటమితో తెరాసలో అంతర్మథనం