కొవిడ్ నియంత్రణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్... ఔషధాలు, టీకాల ఉత్పత్తిదారులతో సమావేశమైంది. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సభ్యులతో పాటు ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్మునోలాజికల్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
ఉత్పత్తి పెంచే దిశగా...
కొవిడ్ నియంత్రణకు అవసరమైన ఔషదాల సరఫరాపై ఫార్మా కంపెనీలతో చర్చించారు. కరోనా చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్ వంటి ఔషధాల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ టీకాలు తయారు చేస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ బృందం చర్చించింది. ఆయా సంస్థల వాక్సిన్ సరఫరా పెంపుదలకు ఉన్న అవకాశాలు, వాటికి సంబంధించిన గడువు, టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు.
టీకాలు అందించాలన్న లక్ష్యంతో...
రాష్ట్రంలో టీకాల తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ వంటి సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయసహకారాలను అందించేందుకు ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థలతో పాటు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ టీకాలను దేశంలో తయారు చేసే అవకాశం ఉన్న కంపెనీలతో కూడా టాస్క్ ఫోర్స్ చర్చించింది. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రజలకు టీకాలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని... ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయా కంపెనీలకు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన వాక్సిన్ల సేకరణ కోసం స్థానికంగా ఉన్న కంపెనీలతో పాటు అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన వివిధ వాక్సిన్ సంస్థలతో కూడా సంప్రదింపులు చేస్తామని తెలిపారు. ఆయా టీకాలకు భారీ ఎత్తున సమీకరించుకునేలా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిలతో వ్యవహరించాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది.
లక్ష మందికి సరిపోయే మాత్రలు విరాళం...
కొవిడ్ చికిత్సలో వినియోగిస్తున్న బారిసిటినిబ్ మాత్రలను నాట్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా విలువైన లక్ష మందికి సరిపోయే.. మాత్రలను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాన్ని నాట్కో వీసీ, సీఈఓ రాజీవ్ నన్నపేనని మంత్రి కేటీఆర్‌కు అందించారు. కరోనా నియంత్రణ చర్యల కోసం తన వంతు పాత్రగా టీఎస్ఐఐసీ కోటీ 19 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. సీఎస్ఆర్ కింద ఆ మొత్తానికి సంబంధించిన చెక్‌ను మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు.