జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సహకారంతో ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు పలు విధాలుగా అండగా ఉంటుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై మంత్రి కేటీఆర్‌తో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సమావేశమయ్యారు.
కరోనా వేళ జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ అండగా నిలిచిందని.. బాధిత జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున అందించిందని మంత్రి అభినందించారు. ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇళ్లు, జవహర్ లాల్ నెహ్రు సొసైటీకి పేట్ బషీరాబాద్‌లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్‌తో పాటు పలు సమస్యలపై కేటీఆర్ చర్చించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, బాల్క సుమన్, టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ యువతి కాళ్లు, చేతులు కట్టిపడేసింది ఎవరో తెలుసా..?