ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, స్థపతితో మంత్రి.... హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు.
ఆలయం అభివృద్ధి నమూనాను పరిశీలించిన కొప్పుల ఈశ్వర్... ప్రతిపాదనలు, ప్రణాళిక, సంబంధిత చర్యల గురించి అధికారులతో చర్చించారు. మంత్రి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. గొప్ప దైవ భక్తులైన ముఖ్యమంత్రి కేసీఆర్... ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
యాదాద్రిని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని... వేములవాడ, ధర్మపురి దేవస్థానాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారని వివరించారు. ధర్మపురి దేవస్థానం పునః నిర్మాణం, విస్తరణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.120కోట్లు కేటాయించగా మొదటి విడతగా 61కోట్ల 66లక్షల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
భక్తి, శ్రద్ధలతో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్ధాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్వామి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తున్నారన్న ఆయన... ఆలయాన్ని, పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్ధి మరిన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా వేలాది మంది తరలి వస్తారని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, గోదావరిలో ఘాట్ల విస్తరణ, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. దేవస్థానం విస్తరణకు కావాల్సిన భూసేకరణ, పునఃనిర్మాణానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి అవసరమైన అనుమతులు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని, టెండర్ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.
ఇవీచూడండి: మాస్కు.. ఎవరు, ఎప్పుడు, ఎలాంటిది ధరించాలంటే?