minister kakani: ఏపీలో నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన కాకాణి.. పవన్ నటనకు మాత్రమే పనికొస్తారన్నారు. తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని.., పార్టీలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.
"కోర్టులో చోరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కోర్టులో చోరీ అంశంపై ఏ విచారణకైనా సిద్ధం. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు. హైకోర్టు స్థాయిలో కూడా విచారణ చేయించుకోవచ్చు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రభుత్వ విచారణ చేయించుకోవచ్చు. ప్రభుత్వ విచారణ తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధం. పవన్‌కల్యాణ్ నటనకే పనికొస్తారు. నాకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు. పార్టీలో అందరం కలిపి పనిచేస్తాం." - కాకాణి గోవర్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇదీ జరిగింది.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు.
అపహరణకు గురైన పత్రాల్లో ఏ1గా మంత్రి కాకాణి
సర్వేపల్లి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు విమర్శలు చేశారు. వివిధ పత్రాలు చూపించి హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానిపై సోమిరెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ (పాస్‌పోర్టు ప్రకారం) ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు.
ఇద్దరు నిందితులు అరెస్టు
నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి.. అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయారావు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.
"నెల్లూరు కోర్టులో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించాం. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారు. బెంచ్ క్లర్క్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌పై పలు కేసులు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితులను అరెస్టు చేశాం. ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం." - విజయారావు, జిల్లా ఎస్పీ
ఇదీ చదవండి: వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదు: గవర్నర్ తమిళిసై