Harishrao Fires on Bjp: ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మునుగోడు ప్రజలు మరువరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మునుగోడులో ప్రజలు గెలవాలా..? రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా..? అంటూ హరీశ్ ప్రశ్నించారు. మునుగోడులో భాజపా నేతలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా.. నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్రపూజలంటూ మాట్లాడటం దారుణమన్న ఆయన.. తాంత్రిక విద్యలపై కోర్సులు పెట్టింది భాజపానే అని మండిపడ్డారు. తెరాస దగ్గర ఉన్నవి లోక్ తాంత్రిక విద్యలు అని పేర్కొన్నారు. తెరాస ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
'మునుగోడు ఉపఎన్నికలో భాజపా దుర్వినియోగానికి పాల్పడుతోంది. నేతలను కొనుగోలు చేయడమే కాకుండా కార్లు, బైకులు కొంటున్నారు. 200 కార్లు, 2వేల బైకులు బుక్ చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. ఇప్పుడు మోటార్లు ఇస్తారు.. రేపు మీటర్లు పెడతారు. మునుగోడులో ప్రధానంగా తెరాస- భాజపా మధ్య పోటీ. దేశ ప్రజల కోసం భాజపా ఒక్క మంచి పనైనా చేసిందా? క్షుద్ర పూజలు చేయడం భాజపాకు అలవాటు. తెరాసది ఉద్యమ చరిత్ర, భాజపాది రక్తచరిత్ర. బనారస్ కళాశాలలో బూత వైద్యం నేర్పించే చరిత్ర భాజపాది. 8 ఏళ్లలో 1.52 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ ఏడాది మరో 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం.'- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
మోటార్లు కావాలో.. మీటర్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలి... మునుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే మునుగోడు ప్రజలను మోసం చేశారన్న ఆయన.. రాష్ట్ర ప్రజల కోసం తెరాస ఎన్నో పథకాలు తెచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక వ్యక్తిగత స్వార్థం.. రాజకీయం కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. మనుగోడులో అడ్డదారిలో భాజపా గెలిచేందుకు ప్రయత్నిస్తోందన్న హరీశ్‌రావు... భాజపా చేసిన మంచి పనేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోటార్లు కావాలో.. మీటర్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారన్న ఆయన.. రూ.400 గ్యాస్ సిలండర్‌ను రూ.1,200 చేశారని ధ్వజమెత్తారు. రూపాయి విలువ దిగజార్చారు.. రాజకీయాలూ దిగజార్చారని మండిపడ్డారు. ఒకప్పుడు కేంద్ర మంత్రులే తమ పథకాలను పొగిడారని.. మిషన్ భగీరథను పొగిడింది భాజపా నాయకులు కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: