సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆక్సిజన్ సరఫరాకు కావల్సిన ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్లు, ట్యాంకర్ల సరఫరా కోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత అధికారులతో బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా కోసం లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, ప్రెజర్ స్వింగ్ అడ్సార్ ప్షన్ ప్లాంట్ల నిర్మాణం, క్రయోజినిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
మెగా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డితో పాటు ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆక్సిజన్ సరఫరా, వైద్య ఉపకరణాల ఉత్పత్తికి సంబంధించి మెయిల్ ప్రతినిధులు సమావేశంలో ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అవసరమైన ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు.