Harish Rao on Tribal Reservation Bill : గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ నుంచి ప్రతిపాదన, బిల్లు రాలేదని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుండా పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పార్లమెంటరీ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపించారు. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. ప్రైవేట్ కంపెనీయా అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బిల్లు వచ్చిందా అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడగడం కూడా అనుమానాస్పదంగా ఉందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీ బిల్లు ఆమోదించినప్పుడు ఎమ్మెల్యేగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ సోయిలేకుండా ప్రశ్న అడిగారని విమర్శించారు. ఉత్తమ్ ప్రశ్న అడగటం.. కేంద్రం బిల్లే రాలేదనడం ఫూల్స్ డ్రామాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీలో సభ్యుడేనని మంత్రి అన్నారు. బిల్లు పంపించడమే కాకుండా కేంద్రంతో అనేక ఉత్తరప్రత్యుత్తరాలు జరపడంతో పాటు... స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి కోరారని చెప్పారు. రాష్ట్రం లేఖలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ ముండా, అజయ్ కుమార్ మిశ్రాలు సమాధానాలు కూడా ఇచ్చారన్నారు.
ఇంత జరిగిన తర్వాత అసలు ప్రతిపాదనలు, బిల్లే రాలేదనడం గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడమేనని హరీశ్ రావు విమర్శించారు. వాట్సప్ నుంచి పార్లమెంటు వరకు భాజపా అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంటును పక్కదోవ పట్టించిన విశ్వేశ్వర్ తుడాను కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గిరిజనులకు, రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి.. పార్లమెంటులో రేపు తెరాస సభ్యులు ప్రివిలేజ్ ఇస్తారు. కేంద్రం తీరుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు, ధర్నాలు, ప్రదర్శనలతో నిరసనలు తెలపాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి దమ్ముంటే గిరిజనుల రిజర్వేషన్ల పెంపును అమలు చేయించాలి.
హరీశ్ రావు, ఆర్థిక మంత్రి
అసెంబ్లీ తీర్మానంపై అవవగాహన లేకుండా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గిరిజనులపై అవగాహన లేని మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రశ్న అడిగే విధానం తెలియకపోవడం సిగ్గుచేటని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి : 'కేంద్ర మంత్రే అలా మాట్లాడటం బాధాకరం'