గ్రాంట్లకు సంబంధించి ఆర్థిక సంఘం సిఫార్సులను పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నష్టపోయిన రూ.723 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రానున్న బడ్జెట్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో అధికారులతో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల విషయంలో చేసే సిఫారసులను కేంద్రం యథాతథంగా ప్రతి బడ్జెట్లో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్, సర్ ఛార్జీల మొత్తాన్ని పన్నుల వాటాలో కలపకపోవడం వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న హరీశ్ రావు... రద్దు చేసి వాటి స్థానంలో పన్నుల రేట్లను పెంచి రాష్ట్రాలకు అధికంగా నిధులు వచ్చేలా చూడాలని కోరారు.
కొవిడ్ కారణంగా రాష్ట్రాలకు జీఎస్డీపీలో రెండు శాతం అధిక రుణాల వెసులుబాటును.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద నిరుడు, ఈ ఏడాది రావాల్సిన 900 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లోని మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఇస్తామన్న హామీ అమలు కాలేదన్న హరీశ్ రావు... అన్ని జిల్లాల్లో అమలు చేసి బకాయిల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. బిహార్‌లో ప్రకటించిన విధంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను దేశమంతటా ఉచితంగా పంపిణీ చేయాలని మంత్రి కోరారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల ఫించన్లకు కేంద్రం ఎన్నో ఏళ్లుగా కేవలం రూ. 200 మాత్రమే ఇస్తోందని... ఈ సాయాన్ని కనీసం వెయ్యి రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేసిన హరీశ్ రావు... జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే విడుదల చేయాలని కోరారు.