Gangula Comments on BJP :భాజపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 4.50 లక్షల బియ్యం సంచుల లెక్క తేలడం లేదనడం అబద్ధమని మండిపడ్డారు. మిల్లర్లు తప్పు చేస్తే కేసులు పెట్టామని.. బియ్యం రికవరీ చేశామని తెలిపారు. కేంద్ర మంత్రి పౌరసరఫరాలపై అవగాహన లేకుండా మాట్లాడారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి మంచి పీఆర్వోను పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
"రాష్ట్రంలో 3.57 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. 8 కోట్ల గన్నీ బ్యాగులు కోరితే కేంద్రం 4 కోట్ల సంచులే ఇచ్చింది. తెలంగాణ రైతుల కోసం భాజపా నేతలు కేంద్రాన్ని ఎప్పుడైనా అడిగారా? రాష్ట్రంలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. కర్ణాటకలో 12 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. 50 లక్షల టన్నులు, 12 లక్షల టన్నుల సేకరణకు ఒకే సమయం ఇస్తున్నారు. బియ్యం మాయమయ్యాయని కాషాయ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ మీ కేంద్రం చేతిలో ఉంది. విచారణ చేపట్టండి. మేము వద్దంటామా? బియ్యం మాయం అనే అంశం రాష్ట్రానికి సంబంధించింది కదా వాస్తవంగానే బియ్యం మాయమైతే రికవరీ యాక్టు పెట్టి ముక్కు పిండి వసూలు చేస్తాం. మిల్లుల్లో బియ్యం మాయం అయ్యాయంటున్నారు. తనిఖీ చేసే అధికారం మీకు ఉంది. మీరు తనిఖీ చేయండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది."
- గంగుల కమలాకర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
Gangula Comments on Kishan Reddy :ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని భాజపా నేతలు అబద్ధాలు చెబుతున్నారని గంగుల మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో 600కు పైగా కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. కేంద్రాల్లో సదుపాయాలు లేవని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి.. భాజపా నేతలు కేంద్రాల వద్దకు వస్తే సదుపాయాలు ఉన్నాయో లేవో తెలుస్తాయని అన్నారు.