Minister Gangula Kamalakar fire on AP government: తెలంగాణలో ఏపీ ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కారుతో అనవసరంగా తగాదా పెట్టుకోవాలని చూస్తున్నారని అన్నారు. హరీశ్‌రావును టార్గెట్ చేసి ఏపీ మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎవరు విడదీయలేరని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు గంగుల మాట్లాడారు.
వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి యత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తల్లి, కుమారుడు, అన్నాచెల్లెళ్లను విడదీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. అలాగే కేసీఆర్ కుటుంబాన్ని విడదీయాలనుకున్నా ఏమీ చేయలేరని సజ్జలను హెచ్చరించారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధిని ఆయన మానుకోవాలని గంగుల హితవు పలికారు. ఒత్తిడిలో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదని ఎద్దేవా చేశారు. గతంలోనే మా సంగతి చూశారు కదా.. మళ్లీ చూస్తారా అని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. అందుకే తెలంగాణకు వలసలు పెరిగాయని గంగుల పేర్కొన్నారు. భాజపాకు బీ టీంగా వైకాపా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ, తెరాస మీద ఏపీ ప్రభుత్వం ఎందుకు విషం చిమ్ముతోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే ఏపీ మంత్రులకు ఖబడ్దార్ అని సవాల్ విసిరారు. కావాలనే రెచ్చగొడితే తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: