పచ్చని పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీరాజ్, మిషన్ భగీరథపై అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ జారీచేసిన 311 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కనీసం 85 శాతం మొక్కలు బతకాలి..
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడోదశ కింద రాష్ట్రానికి 2,724 కిలోమీటర్ల నూతన రహదారులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. వీటి నిర్మాణం కోసం రూ. రెండు వేల కోట్లు నిధులు వస్తాయని పేర్కొన్నారు. అవసరం ఉన్న ప్రతీ ప్రాంతంలో రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో కనీసం 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
దాతలను భాగస్వామ్యం చేయండి..
పంచాయతీల అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు, దాతలు, ప్రవాసులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పంచాయతీ పాలకవర్గాల్లో కో- ఆప్షన్ సభ్యుల నియామకానికి మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు.
ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 600 కోట్లు త్వరగా వచ్చేలా ఒత్తిడి తీసుకొద్దామని మంత్రి తెలిపారు. ఈ నెల 26న దిల్లీలో జరగనున్న జల్జీవన్ మిషన్ సమావేశానికి రాష్ట్రం తరఫున సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను అందులో పొందుపరచాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక.. రూ 500 జరిమానా